Sunday , October 21 2018
Breaking News
Home / తెలంగాణ / వ్యవసాయానికి జనవరి 1 నుండి 24 గంటల విద్యుత్ సరఫరా

వ్యవసాయానికి జనవరి 1 నుండి 24 గంటల విద్యుత్ సరఫరా

*  రైతుల బాగు కోసమే వ్యవసాయానికి జనవరి 1 నుండి
24 గంటల విద్యుత్ సరఫరా
* ఆటో స్టార్టర్లు పూర్తిగా తొలగిస్తే భూగర్భ జలాలకు డోకా
లేదు
*గ్రామస్థాయిలో అధికారులు , ప్రజాప్రతినిధులు
ఆటో స్టార్టర్ల తొలగింపుపై అవగాహన కల్పించాలి
* ఒకప్పుడు కరెంటు వస్తదో పోతదో తెలవనప్పుడు
ఆటోస్టార్టర్ల అవసరం ఉండేది
* ఇప్పుడు నిరంతర సరఫరాతో రైతులకు మేలు
* రైతుల విద్యుత్ భారాన్నంతా ప్రభుత్వమే భరిస్తుంది
*ఎత్తిపోతల పథకాలకయ్యే విద్యుత్ బిల్లులను కూడా
ప్రభుత్వమే చెల్లిస్తుంది
*  విద్యుత్తు శాఖపై సమీక్ష లో ముఖ్యమంత్రి కేసీఆర్

వ్యవసాయానికి 24 గంటల కరెంటుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అయితే ఆటో స్టారర్ల ను తొలగించుకోకపోతే భూగర్భజలాల విషయంలో నష్టపోయే ప్రమాదం ఉన్నందున రైతులు పూర్తి స్థాయిలో సహకరించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర రావు పేర్కొన్నారు . రైతులు నూటికి నూరు శాతం తమ ఆటోస్టార్టర్లు తొలగించుకుంటేనే వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడం వల్ల లాభం కలుగుతుందని, లేనట్లయితే భూగర్భ జలాలు అడుగంటుకుపోయి పంట పొట్టకొచ్చిన సమయంలో కరెంటు ఉన్నా, నీళ్లు లేక పంటలు ఎండిపోయి నష్టపోయే దుస్థితి వస్తుందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే రైతుల మేలు కోసమే 24 గంటల కరెంటు ఇవ్వాలని నిర్ణయించుకున్నందు వల్ల, రైతులు తమను తాము నష్టపరుచుకునే విధంగా వ్యవహరించరనే నమ్మకం తనకుందని సిఎం చెప్పారు. ఆటో స్టార్టర్ల వల్ల కలిగే అనర్థాలను విడమరిచి చెప్పితే రైతులు అర్థం చేసుకుంటారని, స్వచ్చందంగా ఆటో స్టార్టర్లు తొలగించుకుని సహకరిస్తారని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులకు నచ్చచెప్పడం కోసం వ్యవసాయ, విద్యుత్ శాఖ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో పర్యటించి సభలు నిర్వహించాలని సిఎం పిలుపునిచ్చారు.
డిసెంబర్ 31 రాత్రి 12:01 గంటల నుంచి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇది వరకే విద్యుత్ శాఖను ఆదేశించారు. విద్యుత్ శాఖ కూడా రూ.12వేల కోట్లకు పైగా వ్యయం చేసి పంపిణీ, సరఫరా వ్యవస్థలన మెరుగుపరిచి, రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడం కోసం సిద్ధమయింది.

రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడం ద్వారా ఉత్పన్నమయ్యే పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రులు జి.జగదీష్ రెడ్డి, టి.హరీష్ రావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, జెన్ కో-ట్రాన్స్ కో సిఎండి డి.ప్రభాకర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, ట్రాన్స్ కో జెఎండి శ్రీనివాసరావు, ఎన్.పి.డి.సి.ఎల్ సిఎండి గోపాల్ రావు, ఎస్.పి.డి.సి.ఎల్. సిఎండి రఘుమారెడ్డి, డైరెక్టర్లు నర్సింగ్ రావు, శ్రీనివాస్ రెడ్డి, ఎంపి బాల్క సుమన్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్ రావు, రామకృష్ణరావు, శాంత కుమారి తదితరులు పాల్గొన్నారు.
24 గంటల కరెంటు ఇవ్వడం వల్ల కలిగే లాభ నష్టాలను, ఎదురయ్యే సవాళ్లను ఈ సమావేశంలో కూలంకశంగా చర్చించారు. సమైక్య రాష్ట్రంలో కరెంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని స్థితిలో రైతులంతా ఆటోస్టార్టర్లు పెట్టుకున్నారని, ఎప్పుడు కరెంటు వస్తే అవి ఆటోమెటిక్ గా స్టార్ట్ అవుతాయని అధికారులు చెప్పారు. ఇప్పుడు 24 గంటల సరఫరా ఇవ్వడం వల్ల ఆటోస్టార్టర్ల వల్ల 24 గంటల పాటు బోర్లు పోస్తాయన్నారు. మొదట్లో పుష్కలంగా నీళ్లు పోసే బోర్లు పంట పొట్టకొచ్చే నాటికి భూగర్భ జలాలు అడుగంటి పోవడం వల్ల ఎండిపోయే పరిస్థితి వస్తుందని అధికారులు వివరించారు. కరెంటు అందుబాటులో ఉన్నా, భూగర్భంలో నీరు లేక రైతులు నష్టపోవాల్సి వస్తుందని చెప్పారు. ఎక్కువ లోతున్న బోర్ల వల్ల తక్కువ లోతున్న బోర్లకు కూడా నష్టం వాటిల్లుతుందని వివరించారు. గ్రామాల్లో రైతుల నుంచి తమకు ఈ రెండు విషయాల్లోనే ఫిర్యాదులు, అభ్యంతరాలు వస్తున్నాయని వెల్లడించారు. ఆటో స్టార్టర్లు పూర్తిగా తొలగించుకోకపోతే, చివరికి 24 గంటల కరెంటు సరఫరా ప్రతికూల ఫలితాలు ఇచ్చే ప్రమాదం కూడా ఉందని చెప్పారు.

దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి వ్యవసాయానికి 24 గంటల సరఫరా కార్యక్రమం వల్ల రైతులు పూర్తి స్థాయిలో లబ్ది పొందే వ్యూహం ఖరారు చేసి అమలు చేయాలన్నారు. ఆటోస్టార్టర్లను తొలగించుకోవడంతో పాటు అవసరం మేరకు మోటార్లతో నీరు తోడుకునేలా రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. ‘‘చెరువులో ఉన్న నీటిని పొదుపుగా వాడుకుని వ్యవసాయం చేసుకునే అలవాటు, పద్దతి మన రైతులకుంది. ఇప్పుడు భూగర్భ జలాలను కూడా అవసరం ఉన్న మేరకే పొదుపుగా వాడుకుంటారనే నమ్మకం నాకుంది. రైతులు ఎప్పుడూ తమను తాము నష్టపరుచుకోరు. గతంలో కరెంటుపై నమ్మకం లేక ఆటోస్టార్టర్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు కరెంటు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆటోస్టార్టర్ల అవసరం లేదు. పైగా పంటలకు అవసరానికి మించి నీరు పెడితే నష్టమే జరుగుతుంది. ఈ విషయంపై రైతులకు అవగాహన ఉంది. ఆటో స్టార్టర్ల వల్ల భూగర్భ జలాలు అడుగంటుకుపోయి, చివరి దశలో తమకే నష్టం కలుగుతుందనే వాస్తవం అర్థమైతే రైతులు తప్పకుండా సహకరిస్తారు. విద్యుత్ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు మండలస్థాయి అధికార యంత్రాంగం సహకారంతో ఆటోస్టార్టర్ల తొలగింపుకు రైతుల్లో అవగాహన తీసుకురావాలి. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు కూడా గ్రామాల్లో పర్యటించి, రైతులతో సమావేశం జరిపి వారికి వాస్తవ పరిస్థితులు వివరించాలి. కరెంటు ఉన్నా నీరు లేకుంటే వ్యవసాయం సాగదనే విషయం రైతులకు అర్థమయితే స్వచ్చందంగా సహకరిస్తారు. రైతులను ఒప్పించి, మెప్పించి ఆటోస్టార్టర్లు వందకు వందశాతం తొలగించాలి. వ్యవసాయానికి 24 గంటల సరఫరా చేయడం వల్ల మంచి ఫలితాలు రావడానికి సమిష్టిగా పాటుపడాలి’’ అని సిఎం ఉద్భోదించారు.

భారమంతా ప్రభుత్వానిదే : విద్యుత్ సంస్థలకు సిఎం హామీ

వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా కావడం వల్ల కలిగే భారాన్నంతా ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విద్యుత్ సంస్థలకు హామీ ఇచ్చారు. జనవరి 1 నుంచి ఇచ్చే కరెంటు కయ్యే ఖర్చును ఈ ఏడాది బడ్జెట్ నుంచే ఇస్తామని, వచ్చే బడ్జెట్లో విద్యుత్ సబ్సిడీలకిచ్చే డబ్బులను అదనంగా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ శాఖ పెట్టే వ్యయంలో కేవలం 9 శాతం మాత్రమే జీతాల కింద ఖర్చు పెడుతూ అత్యంత క్రమశిక్షణతో నడుస్తున్న విద్యుత్ సంస్థలను కాపాడుకుంటామని సిఎం ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి ప్రారంభమయ్యే ఎత్తిపోతల పథకాలకయ్యే విద్యుత్ బిల్లులను కూడా ప్రభుత్వమే నూటికి నూరు శాతం చెల్లిస్తుందని సిఎం చెప్పారు. వచ్చే ఏడాది వర్షాకాలం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల లిఫ్టులు పనిచేయడం ప్రారంభిస్తాయి కాబట్టి, విద్యుత్ శాఖ సిద్ధంగా ఉండాలని సిఎం కోరారు.

About Srinivas Kuncham

Check Also

నిజామాబాద్ రైల్వే స్టేషన్ కు సోలార్ పవర్ ప్లాంట్ మంజూరు

నిజామాబాద్ రైల్వే స్టేషన్ కు సోలార్ పవర్ ప్లాంట్ మంజూరు అయ్యింది. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *