Thursday , June 21 2018
Breaking News
Home / ఆంధ్రప్రదేశ్ / రాబోయే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యకు, యువతకు పెద్దపీట

రాబోయే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యకు, యువతకు పెద్దపీట

విద్యకు దన్ను…యువతకు భరోసా
ఇంటర్మీడియట్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం
టెన్త్ లోపు విద్యార్థులకు మధ్యాహ్న భో జనంతో పాటు బ్రేక్ ఫాస్ట్
8వ తరగతి విద్యార్థినులకూ సైకిళ్లు
జర్నలిస్టు హౌసింగ్ స్కీమ్ కు నిధులు
బడ్జెట్ ప్రతిపాదనల్లో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు

ఆంధ్రప్రదేశ్ : రాబోయే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యకు, యువతకు పెద్దపీట వేయనుంది. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఇప్పటికే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. డ్రాపౌట్స్ నిరోధంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే పదో తరగతి వరకూ మధ్యాహ్నం భోజన అమలు చేస్తోంది. పేద విద్యార్థులకు మరింత మేలు కలిగే విధంగా, ఉదయం టిఫిన్ (బ్రేక్ ఫాస్ట్) అందజేయాలనే ఆలోచన చేస్తోంది. అలాగే, ఇంటర్మీడియట్ విద్యార్థులకూ మధ్యాహ్నం భోజనం పెట్టాలని భావిస్తోంది. బాలికా విద్యకు భరోసా కలిగించేలా, ఇప్పటివరకూ 9వ తరగతి విద్యార్థినులకు బడికొస్తా….పేరుతో సైకిళ్లు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి విద్యార్థినులకు సైకిళ్లు అందజేయాలని భావిస్తోంది. యువతకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వీలైనంతవరకూ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ భృతి ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. వీలైనంత త్వరగా నిరుద్యోగులకు సంబంధించిన వివరాలు అందజేయాలని సంబంధిత శాఖాధికారులకు రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో రాబోయే బడ్జెట్ లో ప్రతిపాదనలపై హౌసింగ్, విద్యా, టూరిజం, యువజన శాఖాధికారులతో సోమవారం మధ్యాహ్నం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే బడ్జెట్ యువతకు, విద్యకు, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతివ్వాలని అధికారులకు రాష్ట్ర ఆర్థిక మంత్రి దిశా నిర్దేశం చేశారు. విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆ శాఖాధికారులకు ఆయన స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకూ మధ్యాహ్నం భోజన పథకం అమలుపై సాధ్యాసాధ్యాలపై చర్చించారు. పేద విద్యార్థులకు మరింత ఉన్నత చదువులు చదివేందుకు ఆస్కారముంటుందన్న ఉద్దేశంతో ఎంత ఖర్చయినా భరించి, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడానికి మంత్రి అంగీకరించారు. ప్రస్తుతం ఒకటి నుంచి పదో తరగతి వరకూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. డ్రాపౌట్లు తగ్గించడమే కాకుండా పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఉదయం వేళల్లో టిఫిన్ అందించడానికి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నిర్ణయించారు. ఇందుకయ్యే వ్యయంపై లెక్కలు తేల్చాలని ఆర్థిక శాఖాధికారులకు మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో 34 లక్షలకు పైగా విద్యార్థులకు మేలు కలుగుతుందని విద్యాశాఖాధికారులు తెలిపారు.
8వ తరగతి విద్యార్థులకూ సైకిళ్లు….
బాలికా విద్యను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం బడికొస్తా..పథకాన్ని అమలుచేస్తున్న విషయం తెలిసేందే. ఈ పథకం ప్రభుత్వ పాఠశాలల్లో 9వ తరతిగతి చదువుతున్న విద్యార్థినులకు సైకిళ్లు అందజేస్తోంది. బాలికా విద్యాలో డ్రాపౌట్ల నిరోధానికి, మహిళా అక్షరాస్యత పొంపుదలకు 8వ తరగతి చదువుతున్న విద్యార్థినులకూ సైకిళ్లు అందజేయాలన్న రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కోరికను మన్నిస్తూ, రాబోయే బడ్జెట్లో అవసరమైన నిధులు కేటాయించాలని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు … ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలన్నారు. గ్రామాలు, మున్సిపాల్టీల్లో ఉన్న గ్రంథాలయాలను పటిష్టపర్చాలని, అవసరమైన చోట అవుట్ సోర్సింగ్ పద్ధతిలో లైబ్రేరియన్ పోస్టులును భర్తీచేయాలని సంబంధిత అధికారులను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశించారు. వయోజన విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తేనే రాష్ట్రంలో 100 శాతం మేర అక్షరాస్యత సాధ్యమవుతుందన్నారు. పదో తరగతి పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన ప్రతిభా విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీకి నిధులు మంజూరు చేయాలని విద్యాశాఖాధికారులు కోరగా, ఇందుకు ఆర్థిక మంత్రి అంగీకారం తెలిపారు. స్కిల్ డవలప్ మెంట్ కింద యువతకు శిక్షణివ్వాలని సంబంధిత అధికారులకు మంత్రి యనమల రామకృష్ణుడుస్పష్టం చేశారు.
టూరిజంలో ప్రైవేటు భాగస్వామ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, భవానీ ఐల్యాండ్ లో చిన్న పిల్లలను ఆకర్షించేవిధంగా మ్యూజియంలు ఏర్పాటుచేయాలని సంబంధిత అధికారులకు రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశించారు. రాష్ట్రంలో 3 జిల్లాల్లో శిల్పారామాలు ఏర్పాటు చేయనున్నామని, దీనికి నిధులు కేటాయించాలని అధికారులు కోరడంతో, అందుకు మంత్రి అంగీకారం తెలిపారు. ఎన్.సి.సి, క్రీడల్లో రాణించేలా విద్యార్థుల్లో ఆసక్తి కలిగేలా చూడాలన్నారు. వీటివల్ల చెడువ్యసనాలకు విద్యార్థులు దూరంగా ఉండే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా క్రీడల్లో ఏపీకి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చేలా చూడాలన్నారు. ఇందుకోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతి గ్రామానికీ స్పోర్టు కిట్ అందజేయాలని, ఇందుకు అవసరమైన నిధులు అందజేస్తామని యువజన సర్వీసు అధికారులకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు.
రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు కోరారు. ఇందుకు ఆర్థిక మంత్రి యనమల అంగీకరించారు.
జోరుగా ఇళ్ల నిర్మాణాలు…ఆర్థిక మంత్రి ప్రశంసలు…
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగడంపై రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సంతృప్తి వ్యక్తంచేస్తూ, రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులను ఆయన అభినందించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో గృహ నిర్మాణం ముఖ్యమైనదన్నారు. ఇందుకు అసరమైన నిధులు సమకూర్చడంలో వెనుకాడేది లేదని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులకు మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఇటుకల తయారీకి జాతీయ ఉపాధి హామీ పథకం కింద రావాల్సిన నిధులు రాకపోవడంతో, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడానికి గల అవకాశాలపై చర్చించారు. సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టు హౌసింగ్ పథకానికి నిధులు కేటాయించాలని మంత్రి కాల్వ శ్రీనివాసులు కోరగా, అందుకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అంగీకారం తెలిపారు.
ఈ సమీక్షా సమావేశాల్లో మంత్రులు కాల్వ శ్రీనివాసులు, అయన్నపాత్రుడు, అఖిలప్రియ, శిద్ధా రాఘవరావు, కొల్లు రవీంద్రతో పాటు స్పెషల్ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రిన్సిపల్ కార్యదర్శులు ఆదిత్యనాథ్ దాస్, నీరభ్ కుమార్ ప్రసాద్, సమాచార పౌర సంబంధాల శాఖ అడిషనల్ డైరక్టర్ కృష్ణానంద్ తదితరులు పాల్గొన్నారు.

About Srinivas Kuncham

Check Also

బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గణేష్ బిగాల

ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు సోమవారం రాత్రి 09:30నుండి అర్థ రాత్రి 02:00గంటల వరకు నిజామాబాద్ నగరం లో జరుగుతున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *