రాష్ట్రంలో మొట్టమొదటి ఎకనామిక్ సిటీగా జక్కంపూడి సిటీ అభివృద్ధి
జక్కంపూడిలో రూ. 1కోటి 57 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
10 వేల ఇళ్లు జక్కంపూడి ఎకనామిక్ సిటీలో మొదలుపెడుతున్నాం
ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
విజయవాడ రూరల్ : మార్చి ఆఖరుకు అన్ని గ్రామాల్లో మరుగుదొడ్లు పూర్తి చేయాలని లేకుంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి గ్రామాల్లో కూర్చుని దీక్ష చేస్తారని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం నాడు మండలం లోని షాబాద్-జక్కంపూడి గ్రామంలో మంత్రి ఉమా పర్యటించి సుమారు 1 కోటి 57 లక్షల 50 వేల తో వివిధ అభివృద్ధి పనులైన పైడూరుపాడు పి.ఆర్ రోడ్డు నుండి టి. మధుసూదనరావు పొలం మీదుగా షాబాద్ వరకు రోడ్డు అభివృద్ధి పరుచుటకు పంచాయతీ రాజ్ అసెట్స్ నిధుల నుండి రూ.84.50 లక్షల పనులకు శంకుస్థాపన మరియు 14వ ఆర్ధిక సంఘం & ఉపాధి హామీ నిధులు రూ. 73 లక్షలతో షాబాద్ జక్కంపూడి బిసి కాలనిలో 5 పనులు సీసీ రోడ్లు మరియు డ్రైన్ పనులకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం మంత్రి ఉమా మాట్లాడుతూ, ఈ సంవత్సరం లో చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేస్తాం. వైకుంఠపురం నుండి పల్నాడు కు కూడా నీళ్లిస్తామని తెలిపారు. కులం, మతం, పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. 16వేల కోట్లు లోటు బడ్జెట్, లక్ష కోట్లు అప్పు ఉన్నా సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని తెలిపారు. ఉపాధిహామీ నిధులు, పంచాయతీ రాజ్ నిధులు, స్పెషల్ నిధులు తీసుకొచ్చామని, పైడూరుపాడు-జక్కంపూడి రోడ్డు 4కోట్ల 18 లక్షలతో అభివృద్ధి చేసుకున్నామని, పంచాయతీ భవనం మార్చి కల్లా రూ. 15 లక్షలతో పూర్తి అవుతుందని తెలిపారు. గ్రామస్తులు మంచినీరు సమస్య చెప్పగా, కృష్ణా జలాలు సంపులోకి వచ్చాయని త్వరలో నీళ్లిస్తామని తెలిపారు. 59 గ్రామాల్లో జక్కంపూడి గ్రామానికి ఒక ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నానని మంత్రి తెలిపారు. 323 మందికి వ్యవసాయ రంగంలో రూ.54.27 లక్షలు, డ్వాక్రా రుణాలు 45 గ్రూపులకు రూ.10.94 లక్షలు, ఎన్టీఆర్ భరోసా 319 మందికి రూ.143.13 లక్షలు, సీఎం సహాయనిధి 11 మందికి 17 లక్షలు, వ్యక్తిగత మరుగుదొడ్ల 37 మంది రూ.5.46 లక్షలు, గ్రామ పంచాయతీ పరిధిలో వివిధ గ్రాంట్ల ద్వారా 19 పనులు రూ.224 లక్షలతో అభివృద్ధి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.